*పరిచయం*
ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహిళలు తమ పాతివ్రత్య మహిమ చేత, దైవభక్తి చేత గ్రామ దేవతలుగా పూజలందుకుంటున్నారు. వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన నర్రవాడ వెంగమాంబ అగ్రగణ్యులు. ఆమె కేవలం ఒక పేరంటాలుగా మాత్రమే కాక, సమాజ శ్రేయస్సుకు, సంస్కరణకు, నైతిక విలువల పునరుద్ధరణకు మరియు అస్పృశ్యత నివారణకు కృషి చేసిన ఒక మహిమాన్విత శక్తీ. మానవత్వం నుండి దైవత్వం ఎలా ఆవిర్భవిస్తుందో నిరూపించిన మహోన్నత తల్లి వెంగమాంబ.
*జననం - బాల్యం*
క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నర్రవాడ గ్రామానికి సమీపంలో గల వడ్డీపాళెంలో పచ్చన వెంగమ నాయుడు, సాయమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారు శ్రీ ఎల్లమ్మ తల్లి పరమ భక్తులు. సంతానం కోసం వారు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి, వ్రతాలు, దానధర్మాలు చేశారు. వారి నోముల పంటగా ఎల్లమ్మ తల్లి అంశతో వెంగమాంబ జన్మించింది.
దివ్య శక్తులతో జన్మించిన ఆమె, పుట్టుకతోనే ప్రణవ నాదాన్ని (ఓంకారాన్ని), గాయత్రీ మంత్రాన్ని పలికింది. చిన్నతనం నుంచే ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, తన నెచ్చెలి అయిన తుమ్మల పెదవేంగమ్మకు ఆధ్యాత్మిక సూత్రాలను, ఆర్య సూక్తులను బోధిస్తూ, వాటిని ఆచరణలో చూపేది. ఆమె బోధనల వల్ల గ్రామ ప్రజలు భక్తిప్రపత్తులతో, నైతిక జీవనాన్ని సాగిస్తూ చైతన్యవంతులయ్యారు.
*వివాహ జీవితం - సామాజిక సేవా దృక్పథం*
యుక్తవయస్సుకు వచ్చిన వెంగమాంబను అదే గ్రామానికి చెందిన వేమూరి అంకయ్య నాయుడు రెండవ కుమారుడైన గురవయ్యకిచ్చి వివాహం జరిపించారు. గురవయ్య సాహసవంతుడు, సౌశీల్యవంతుడు. వెంగమాంబ ఆయన సహచర్యంలో వివాహ జీవిత వైశిష్ట్యాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించింది.
"నా జీవితం నా కోసం కాదు, సమాజం కోసం" అని నమ్మిన వెంగమాంబ, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయక సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడింది.
*అస్పృశ్యత నివారణ:*
ప్రజలంతా సమానులని, అంటరానితనం అనేది జాతి మనుగడకు సామాజిక శాపమని బోధించింది.
మానవతా విలువలు: తాగునీటి ఎద్దడితో అలమటిస్తున్న దళిత వర్గాలకు అండగా నిలబడి, మంచినీరు అందించి సామాజిక కట్టుబాట్లను ఎదిరించింది. దళిత, వెనుకబడిన వర్గాలను ఆదుకుంది.
వీరోచిత పోరాటం - యోగాగ్ని ప్రవేశం
ఆ రోజుల్లో నర్రవాడ ప్రాంతంలో గజదొంగల అకృత్యాలు ఎక్కువగా ఉండేవి. పురుషులు పశువుల మేపు కోసం, అమ్మకాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు.. స్త్రీలు, వృద్ధులు ఆ దొంగల నీచకృత్యాలకు బలికావాల్సి వచ్చేది.
ఒకసారి గజదొంగలు గ్రామంపై పడగా, వెంగమాంబ తన ఐదవతనాన్ని సైతం లెక్కచేయక, తన భర్తను ఆయుధంగా మలచి గజదొంగల మీదికి పంపింది. సాటి మానవుల ప్రాణాలను, మహిళల మానాన్ని కాపాడటానికి గురవయ్య గజదొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చాడు. అయితే, ఒక గజదొంగ రహస్యంగా వెనుక నుండి వేసిన బల్లెం పోటుతో గురవయ్య నేలకొరిగాడు.
భర్తకు మరణం తప్పదని గ్రహించిన వెంగమాంబ, తాను సుమంగళిగానే తనువు చాలించి, పేరంటాలుగా వెలసి ప్రజలను రక్షించాలని నిర్ణయించుకుంది. దళితులు స్వయంగా తయారు చేసి ఇచ్చిన నేత చీరను కట్టుకొని, భర్త చుట్టూ ప్రదక్షిణ చేసి యోగాగ్నిలో దూకి అనంతశక్తిలో ఐక్యమైపోయింది.
*దైవత్వంగా ఆవిర్భావం*
తల్లిని కోల్పోయిన బిడ్డల్లా రోదిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా వెంగమాంబ ఓదార్పునిచ్చింది. "నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను. అందుకు గుర్తుగా నా మంగళసూత్రాలు, పమిట చెంగు, మెట్టెలు, పసుపు కుంకుమలు చెక్కుచెదరకుండా అగ్నిలో నుంచి లభిస్తాయి" అని చెప్పింది. ఆమె చెప్పినట్లే ఆ వస్తువులు సురక్షితంగా లభించడంతో ప్రజలు భక్తిపార్వశ్యంతో "శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై" అంటూ జయజయధ్వానాలు చేశారు.
1940వ సంవత్సరంలో ఇక్కడ అమ్మవారికి ఆలయ నిర్మాణం జరిగింది. ఈ మందిరంలో భర్త గురవయ్యతో కొలువైన అమ్మవారికి ఎడమవైపున ఆమె స్నేహితురాలైన పెదవేంగమ్మ దంపతుల విగ్రహాలు, కుడివైపున వెంగమాంబ బావగారైన ముసలయ్య విగ్రహం ఉండి పూజలందుకుంటున్నాయి.
*స్థల పురాణం & ఉదయగిరి నేపథ్యం*
భగవద్గీత ప్రకారం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తాడు. అలాగే జగన్మాత అనేక రూపాల్లో అవతరించి లోకకళ్యాణం చేస్తుందని దేవీ భాగవతం చెబుతుంది. నర్రవాడ ప్రాంతంలో మూఢనమ్మకాలు, గజదొంగల అరాచకాలు పెరిగిపోయినప్పుడు, ప్రజల కన్నీటి ప్రార్థనలు ఆలకించి ఆదిపరాశక్తి అయిన ఎల్లమ్మ తల్లి ఇక్కడ ‘శ్రీ వెంగమాంబ’గా జన్మించిందని స్థల పురాణం.
ఈ క్షేత్రం చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన ఉదయగిరి దుర్గానికి ఈశాన్య దిశలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్రవాడ గ్రామంలో (నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం) కొలువై ఉన్నది. ఉదయగిరి చుట్టుపక్కల ఒకప్పుడు 365 దేవాలయాలు ఉండేవని, 13వ శతాబ్దంలో కాటమరాజు తన పశువులను ఇక్కడే మేపాడని చరిత్ర చెబుతోంది.
*శ్రీ నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు*
ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు ఐదు రోజుల పాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి (సాధారణంగా ఇవి జూలై 5 నుండి 9వ తేదీల మధ్య వస్తాయి).
ఆదివారం: నిలుపు ఉత్సవం
సోమ, మంగళవారాలు: గ్రామోత్సవం
బుధవారం: పసుపు కుంకుమ ఉత్సవం
గురువారం: పొంగళ్ళు, బండ్లు తిరుగుట, ఎడ్లచే బండ్లు లాగుడు పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమలు.
ఉత్సవాల ప్రత్యేకత:
ఈ తిరుణాళ్లకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
భక్తులు టన్నుల కొద్దీ ఎండు కొబ్బరిని అగ్నిగుండంలో సమర్పించడం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
ఈ ఐదు రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలు ఎవరూ మాంసభక్షణ చేయరు, పూర్తిగా సాత్విక జీవనం గడుపుతారు.
*ముగింపు*
0 Comments