*ప్రమాదాలకు నిలయంగా పోరుమామిళ్ల రహదారులు.. కలెక్టర్‌కు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి వినతి* *రూ.28 కోట్ల డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని డిమాండ్*


వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో పాటు డ్రైనేజీ పనులు సంవత్సరాలుగా పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్‌రావు వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
పోరుమామిళ్ల పట్టణంలో  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సర్కిల్ నుంచి బద్వేల్ రోడ్డులోని కమ్మవారిపల్లె వరకు, అలాగే మైదుకూరు రోడ్డులోని వసుంధర కళ్యాణ మండపం వరకు ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కడప–విజయవాడ ప్రధాన రహదారి, బద్వేల్–పోరుమామిళ్ల రహదారులపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.
వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల రాకపోకలు సైతం ఇబ్బందికరంగా మారుతున్నాయని, అత్యవసర సేవలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో వివరించారు.
ఈ సమస్యలపై పలుమార్లు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు స్పందించలేదని, మండల, జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.
అదేవిధంగా, పోరుమామిళ్ల పట్టణంలో సుమారు రూ.28 కోట్ల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పనులు ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదని, ప్రణాళికాబద్ధంగా పనులు జరగక ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ధ్వంసమైన రహదారులకు తక్షణ మరమ్మత్తులు చేపట్టడంతో పాటు అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ముత్యాల ప్రసాద్‌రావు వినతిపత్రం ద్వారా కోరారు.

Post a Comment

0 Comments