భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వడగాల్పుల ధాటికి సామాన్య ప్రజలు, బాటసారులు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో బయటకు రావాలంటేనే జనం భయం గురవుతున్నారు. ముఖ్యంగా డీహైడ్రేషన్ బారిన పడి నీరసించిపోవడం, వడదెబ్బ తగలడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోరుమామిళ్ల పట్టణంలో వెల్లివిరిసిన మానవత్వం బాటసారులకు ఎంతో ఊరటనిచ్చింది.
స్థానిక బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రం వద్ద గుండెబోయిన శ్రీనివాసులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎండ తీవ్రతతో గొంతు ఎండిపోతున్న ప్రయాణికులకు, నిరంతరం ఎండలోనే విధులు నిర్వహించే వ్యాపారస్తులకు ఈ మజ్జిగ పంపిణీ ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి తక్షణమే చలువ చేయడమే కాకుండా, ఎండ వల్ల కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుందని, ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సేవా కార్యక్రమం పట్ల ప్రజల నుండి విశేష స్పందన లభించింది. బస్టాండ్‌లో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే బాటసారులు ఈ చల్లని మజ్జిగను సేవిస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఇంతటి మండు వేసవిలో గొంతు తడుపుకోవడానికి చల్లని మజ్జిగ అందించడం నిజంగా గొప్ప సేవా కార్యక్రమం" అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాసులు కుటుంబాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో చిన్నపురెడ్డి వెంకటరెడ్డి, జయరాం రెడ్డి, ఫణి రావుస్వామి, రవీంద్రారెడ్డి, సనమాల రవి, కేశవ, సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొని, స్వయంగా మజ్జిగను పంపిణీ చేస్తూ సేవా గుణాన్ని చాటుకున్నారు. సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
0 Comments